కృష్ణా జిల్లా టిడిపి రాజకీయాలలో విభేదాలు బట్టబయలు అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి పై దేవినేని ఉమపై విజయవాడ ఎంపీ కేశినేని నాని బహిరంగవేదికపైనే ఘాటైన విమర్శలు గుప్పించారు.
శుక్రవారం విజయవాడలోని ఆటోనగర్లో 10ఎమ్ఎల్డీ సీవేజ్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేసినేని నాని అధికారుల తీరును తప్పుపడుతూ వాగ్భాణాలు సంధించారు.
జిల్లా మంత్రి దేవినేని ఉమా, అధికారులు తమకు ఏమీ తెలియకుండా, ఏమి చెప్పకుండా చేసుకుపోతున్నారని...తమను కలుపుకొనిపోవటం లేదని.. ఇది ఎంతమాత్రం సరికాదని కేసినేని అన్నారు.
అధికారులే అన్నీ చేసుకుపోతే... ఇక మేం గెలిచి ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు.
కేశినేని నాని తనను సూటిగా విమర్శించినప్పటికీ... కేశినేని నానికి, తనకు మధ్య ఎటువంటివిభేదాలు లేవని మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు అన్నారు.
తామిద్దరం నగర అభివృద్ధికికలిసి పని చేస్తున్నామని, ఈవిషయంపై గురువారం రాత్రి కూడా తాను నానితో మాట్లాడానని మంత్రి దేవినేని ఉమా చెప్పారు.
మరి ఈ టిడిపీ కోల్డ్ వార్ విజయవాడ రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పుతుందో చూడాలి.