జన సేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతు సమస్యలపైన, ఆంధ్ర ప్రదేశ్ కు సంబందించి ప్రత్యేక హోదా పై శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
రాజధాని ప్రాంత గ్రామాలయినటువంటి ఉండవల్లి, పేనుమాక, బేతపూడి రైతులు భూములు ఇవ్వడానికి అయిష్టంగా ఉన్నారని మిగిలిన వారంతా ఇష్టపూర్వకంగానే భూములిచ్చారని పవన్ పేర్కొన్నారు.
బేతపూడి గ్రామంలోని ప్రజల భూమిని ఇప్పటికి మూడు సార్లు తీసుకున్నారన్నారని మిగిలిన కొద్ది భూమిని ఇస్తే ఎలా బ్రతకాలి అనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని....వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని అన్నారు.
భూములిచ్చినవారు అనుమానం వ్యక్తం చేస్తున్నారని... ఉండవల్లి ప్రజలకు ప్యాకేజీ తక్కువగా ఉందని, పెనుమాకలో మూడు పంటలు పండే పొలాలున్నాయని పవన్ తెలిపారు
ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదని... ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసేందుకే యత్నిస్తున్నాని పవన్ అన్నారు.
రాష్ట్ర విభజన సరిగా చేయలేదని.... పాలకుల విధానాల్లో లోపం ఉంటే ఆ ప్రభావం రాబోయే తరాలపై పడుతుందని పవన్‌ కళ్యాణ్ అన్నారు.
గ్రామాలు ఉండాలి, గ్రామాభివృద్ధి కూడా జరగాలని...అంతే కాని అభివృద్ధి మాటున గ్రామాలను నాశనం చేయ వద్దని పవన్ సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అభివృద్ధిని ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందని.... అభివృద్ధి పేరు మీద హైదరాబాద్‌ చుట్టుపక్కల ఇంతక ముందు ప్రభుత్వాలు సేకరించిన భూమిలో చాలా భాగం ఇప్పటికీ ఖాళీగా ఉందని పవన్ గుర్తు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకోలేక పోయిందని...పార్టీలకతీతంగా మంత్రులు దీని మీద పార్ల మెంటులో పోరాడాలని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ర్టాలు కూడా డిమాండ్‌ చేస్తాయని ఇప్పుడు అంటున్నారని...అయితే ఆ విషయం ముందు తెలియదా అని ప్రశ్నించారు.
విభజన సమయంలో పార్లమెంటులో ఎందుకు మాట ఇచ్చారని... మాట తప్పితే ఏపీలో బీజేపీని ఎలా నమ్ముతారని పవన్‌ కళ్యాణ్ ప్రశ్నించారు.
త్వరలో ఏ ఎన్నికలు వచ్చినా జన సేన పోటీ చేస్తుందని... అయితే పోటీ చేసేది గెలుపు కోసం కాదని అనుభవం కోసమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.