[racchabanda] కనరాని మేఘమై ....

 

కనరాని మేఘమై ( కరుణా వృష్టి/దృష్టి)
===============================

--

ద్విపద

--

కనరాని మేఘమై కరుణవర్షించు 
అనువైన రీతిలో నభివృద్ధి గూర్చు 
--
మనసారఁ గొలుచుచో మహిమలున్ జూపు 
ప్రణవార్థ మెఱిఁగించి పరముఁ జేర్పించు 
--
గణనాథుఁడై యుండి ఘనతఁ జూపించు 
అనఘాత్ముఁడై యొప్పి యాశీర్వదించు 
--
సచ్చిదానందుఁడై సంతోషమిచ్చు 
అచ్చమౌ ప్రేమతో నమ్మగాఁ బ్రోచు 
--
నచ్చు రూపములోన నతులందుకొంచు 
స్వచ్ఛమౌ మనముతో భజియింపఁ జేయు
--
దత్తావతారుఁడౌ ధర్మరక్షకుఁడు 
చిత్తశుద్ధినిఁ గూర్చి సేవలందుకొను 
--
గానమన్నను బ్రీతి, కళలపై ప్రేమ 
కానరానిది శక్తి, కాదు కొల్వంగ 
--
శివ వామభాగగాఁ జెలిమినందించు 
భవహరణమవఁగాఁ బ్రణుతిఁ జేయించు 
--
అన్నిరూపములౌచు నంతటన్ నిండు 
విన్నంతనే పిల్పు వేగ రక్షించు 
--
నడయాడు దైవమై నా భక్తి గొనును 
విడరాని బంధమై వెన్నంటి యుండు
--
యతిరూపధారియై యవనిపై నున్న 
నతని చెంతన నుండు నష్టసిద్ధులును 
--
కామితమ్ములనిచ్చు కల్పవృక్షమగు 
నామకీర్తన మెచ్చు జ్ఞానదాతయును 
--
రాణకెక్కినవాఁడు రంజించు వాఁడు 
పూని మంచిని నాకు బోధించువాఁడు 
--
ఖేలగాఁ బలుకాడి కినుక నిచ్చినను 
వేలుగాఁ బద్యాల వేడ్కయున్ గూర్చు
--
గురుపూర్ణిమావేళ గొప్ప కాన్కనిడి 
మురిపించె నన్నెంతొ పూర్ణసత్కృపను 
--
ప్రత్యక్షమై నాకు స్వప్నమ్ము లోన 
నత్యాదరమ్ముతో నందించె వరము 
--
ఆట యేమోనంచు ననుమానమొంది 
మాటలాడక యున్న మనములో వేఁగి
నిజమేనె యనిచెప్పి నెయ్యమ్ము తోడ
భజియింపగాఁజేసె వ్రాయించి కవిత

--

సుప్రభ 
2:55 AM
07-28-2018

**

కొన్ని గంటలలో తెల్లవారుతుందనగా గురుపూర్ణిమముందు రాత్రి కలలో కనిపించినప్పుడు, నేను దగ్గరకు జేరి మోకరిల్లి నమస్కారము జేసి తలయెత్తి తనవంక జూస్తుండగా నవ్వుతూ మూడుసార్లు తన వ్రేలితో ఆజ్ఞాచక్రము స్థానములో నొక్కి, దోసిలినిండ చిన్ని కలకండ గడ్డలు, పలుకులు నింపి ఒక్కొక్కటే తింటూ ఉండు అని చెప్పారు. మామూలు కలా లేక యేదైనా విశేషమున్నదా? లేక ఆటగా యిలా చేశారా? ఎలా అర్థము చేసికోవాలి అనుకుంటూ రోజంతా తర్కించుకొంటూనే ఉన్నాను. అడగాలనిపించినా మరల ఏమి చెప్పి యేమాటలాడుతారో నని మౌనము వహించాను. మనస్సు గ్రహించి వ్రాయించిన వాక్యాలు పైవి. ఏదో తనగురించి వ్రాయిస్తున్నారని అనుకొన్నాను. చివరకు స్వప్నము సంగతి కూడ వెల్లడి జేయించారు. ఇది బైటకు చెప్పుకొనే విషయము కాదు గదా అని ప్రచురించకుండా ప్రక్కన బెట్టానని యిప్పుడే మరల కొన్ని తేటగీతులలో పలికి, అది వాస్తవముగా జరిగినదే. స్వప్నములో దరికి జేర్చి వరమందించాను..( దానికి అర్థమేమిటో నేనూ అడగలేదు. వారుకూడా చెప్పలేదు. 2002 లో ఒక గ్రంథము నా శిరస్సుపై నుంచి దీవించినట్లుగానే, యిదికూడా ఒక దీవనగా భావించాను ) ప్రచురించటానికి భయపడనవసరములేదని పోస్ట్ చేసికోమని చెప్పారు. అందువలన తెరపైకెక్కిస్తున్నాను.

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: