బొమ్మలఁ బెట్టవు ...
-------------------------
--
మంగళ గీతి
--
నాలుగు ఇంద్రగణములు
యతి- మూడవ గణము మొదటియక్షరము
--
బొమ్మలఁ బెట్టవు పొగడవు పదెపదె
వమ్ముగఁ బలుకవు వాదము సలుపవు
రమ్మని పిలువక రావెటకెప్పుడు
కమ్మఁగఁ బంచుటె కవితల నిరతము
--
సొమ్ములనడుగవు సుఖమిడ నొలయవు
దమ్మము దప్పవు తల్లిని మరువవు
ఉమ్మలికమ్మును నుడుపఁగ గోరవు
ఇమ్మని వేడుటె హితమగు జ్ఞానము
--
అమ్మది సఖ్యము నమ్మది వాక్యము
నిమ్ముగ గానము నెడఁదను ధ్యానము
నెమ్మది నుండుటె నీకిడు మోదము
సమ్మతి నెప్పుడు సద్గురుడెంచఁగ
--
వరముల నీయఁగ వచ్చెదనన్నను
హరుసము సూపవు, అచ్చెరువందవు
జరిగిన జరుగును జరుగక యున్నను
విరుగదు మనసను బేరిమి భక్తియె
--
కనులివి నిండును గాంచఁగ నీవిధి
మనమును బొంగును మఱిమఱి ప్రేమను
తనియగఁ జేతును దప్పక నిన్నట
వనరుహ నేత్రిగ వర, శుభదాత్రిగ
--
ఎఱుకనొసంగెద నెడదను శీఘ్రమె
యరయఁగ నేకమె యన్నిట నంతటఁ
దెరువున సాగఁగ దీక్షను సులువయి
ధరణికి నీకును దప్పక హితమగు
--
8:35 AM
06-30-2018
**పలికించు వారి మాటలు.
Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com